«أَلَا أُنَبِّئُكُمْ بِأَكْبَرِ الْكَبَائِرِ؟» ثَلَاثًا، قَالُوا: بَلَى يَا رَسُولَ اللهِ، قَالَ: «الْإِشْرَاكُ بِاللهِ، وَعُقُوقُ الْوَالِدَيْنِ» وَجَلَسَ وَكَانَ مُتَّكِئًا، فَقَالَ: «أَلَا وَقَوْلُ الزُّورِ»، قَالَ: فَمَا زَالَ يُكَرِّرُهَا حَتَّى قُلْنَا: لَيْتَهُ سَكَتَ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2654]
المزيــد ...
అబూ బక్రహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“పెద్ద పాపములలోకెల్లా అతి పెద్ద పాపములు ఏమిటో మీకు తెలుపనా?” అలా మూడు సార్లు పలికారు. దానికి మేము “తప్పనిసరిగా చెప్పండి ఓ రసూలుల్లాహ్” అని అన్నాము. అపుడు ఆయన “అల్లాహ్ కు సాటి కల్పించుట, తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపుట మరియు వారితో అమర్యాదగా ప్రవర్తించుట” అలా పలికి, అప్పటివరకు చేరగిలబడి కూర్చుని ఉన్న ఆయన నిటారుగా కూర్చుని “అబద్ధమాడుట మరియు అబద్ధపు సాక్ష్యము చెప్పుట” అని అన్నారు. ఈ మాటలను ఆయన ఆగకుండా పలుమార్లు పలుకుతూనే ఉన్నారు. ఎంతగా అంటే “వారు (ఇకనైనా) మౌనంగా ఉంటే బాగుండును” అని మేము భావించ సాగినాము.”
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు అతి ఘోరమైన పాపముల గురించి తెలుపుతూ, ఈ మూడు పాపములను ప్రస్తావించినారు:
1. ఇతరులను అల్లాహ్ కు సమానులుగా చేయడం – అంటే ఏవైనా ఆరాధనలను అల్లాహ్ కు గాక ఇతరులకు అంకితం చేయడం, ఆ విధంగా అల్లాహ్ యొక్క దైవత్వములో, ఆయన ప్రభుతలో (ఆయన ప్రభువు హోదాలో), ఆయన నామములలో మరియు ఆయన గుణగణాలలో ఇతరులను ఆయనకు సమానులుగా లేదా సాటిగా చేయడం, వారిని లేదా వాటిని ఆయనకు భాగస్వాములుగా చేయడం.
2. తల్లిదండ్రుల పట్ల అవిధేయత: అంటే మాటలలో గానీ, చేతలలో గానీ తల్లిదండ్రులకు హాని కలిగేలా, బాధ కలిగేలా ప్రవర్తించడం, వారి పట్ల ప్రేమాభిమానాలతో, దయతో మెలగకుండా వారిని పట్టించుకోక పోవడం, వదిలివేయడం.
3. అబద్ధాలాడుట మరియు అబద్ధపు సాక్ష్యము చెప్పుట: ఇది ఒకరి నుండి ధనం లేదా భూమి తీసుకుని, దానిని అతనికి తిరిగి ఇవ్వకుండా కాజేసే ఉద్దేశ్యంతో, అలాగే ఒకరి గౌరవాన్ని, ప్రాభవాన్ని మంటగలిపే ఉద్దేశ్యంతో చెప్పే ఏ అబద్ధమైనా, తప్పుడు మాటైనా, వాంగ్మూలమైనా, ప్రకటనైనా లేక అలాంటిది ఏదైనా దీని క్రిందకు వస్తుంది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘అబద్ధాలాడుట మరియు అబద్ధపు సాక్ష్యము చెప్పుట’ ను గురించి పలుమార్లు హెచ్చరించడం, సమాజంపై దాని దుష్పరిణామాలను చూసి, దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటలలో వ్యక్తమయ్యే వ్యాకులతను చూసి సహాబాలు "అయ్యో! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇకనైనా ఆపితే బాగుండు" అని అనుకో సాగినారు.