عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ:
«إِيَّاكُمْ وَالظَّنَّ؛ فَإِنَّ الظَّنَّ أَكْذَبُ الْحَدِيثِ، وَلَا تَحَسَّسُوا، وَلَا تَجَسَّسُوا، وَلَا تَحَاسَدُوا، وَلَا تَدَابَرُوا، وَلَا تَبَاغَضُوا، وَكُونُوا عِبَادَ اللهِ إِخْوَانًا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6064]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
అనుమానాలకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అనుమానం (మనం మాట్లాడే) మాటల్లోనే అత్యంత అసత్యమైనది, దుర్మార్గమైనది. మరియు మీరు ఒకరిని గురించి ఒకరు ఆరాలు తీయకండి; ఒకరిపైనొకరు గూఢచర్యం చేయకండి; ఒకరిపైనొకరు అసూయ చెందకండి; ఒకరినొకరు వదిలివేయకండి (సంబంధాలు తెంచుకోకండి); మరియు మీరు ఒకరినొకరు అసహ్యించుకోకండి. మరియు ఓ అల్లాహ్ దాసులారా సోదరులుగా ఉండండి.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 6064]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో ముస్లిముల మధ్య శతృత్వానికి, విభేదాలకు దారితీసే కొన్ని విషయాలను నిషేధిస్తున్నారు మరియు వాటిపట్ల హెచ్చరిస్తున్నారు. వాటిలో ఈ క్రింద పేర్కొనబడినవి ఉన్నాయి:
(అల్ జన్న్) “అనుమానము” – ఇది హృదయంలో సరియైన ఆధారం ఏదీ లేకుండా (ఇతరుల పట్ల) కలిగే ఒక ఆరోపణ. ఇది స్పష్టంగా ఒక అబద్ధపు ప్రకటన.
మరియు (“అత్తహస్సుస్”): ఇది ప్రజల ఆంతరంగిక విషయాలలోనికి కళ్ళు మరియు చెవుల ద్వారా తొంగి చూడడం. (వారి ఆంతరంగిక విషయాలను గురించి ఆరా తీయడం).
మరియు (“అత్తజస్సుస్”): ఇది దాచిపెట్టబడిన విషయాలలోనికి గూఢచర్యం చేయడం; అతి సాధారణంగా చాలా సార్లు ఇది (లోకుల) చెడు పట్ల అయి ఉంటుంది.
మరియు (“అల్ హసద్”): ఇది ఇతరులకు కలిగే అదృష్టాన్ని చూసి, లేక వారి సిరిసంపదలను, వారి ఆడంబర జీవితాన్ని చూసి ఓర్వలేకపోవడం, అసూయ చెందడం.
మరియు (“అత్తదాబుర్”) గురించి: “అత్తదాబుర్” అంటే ఒకరి నుంచి ఒకరు దూరమైపోవడం, ఒకరంటే ఒకరు ముఖం తిప్పేసుకోవడం – సలాం చేసుకోవడం, ఒకరింటికి ఒకరు వెళ్ళి కలవడం, మంచిచెడ్డలు విచారించడం, మొదలైనవి అన్నీ వదిలి వేయడం.
మరియు (“అత్తబాఘదూ”): అంటే ఒకరినొకరు అసహ్యించుకోవడం, దూరంగా ఉంచడం, అమర్యాదగా ప్రవర్తించడం, వారికి హాని కలిగించడం.
తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ముస్లిముల మధ్య సమన్వయం, సఖ్యత పెంపొందింపజేసే ఒక సమగ్ర వాక్యాన్ని పలికారు – ఓ అల్లాహ్ దాసులారా! సోదరులై ఉండండి అని. సహోదరత్వం అనేది బంధుత్వాలలో చోటుచేసుకునే పొరపొచ్చాలను నయం చేసే ఒక బంధం. అది బంధుత్వాల మధ్య ప్రేమను, సామరస్యాన్ని, ఐకమత్యాన్ని పెంపొందిస్తుంది, బలాన్ని చేకూరుస్తుంది.