عَنْ أَبِي بَرْزَةَ الأَسْلَمِيِّ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا تَزُولُ قَدَمَا عَبْدٍ يَوْمَ القِيَامَةِ حَتَّى يُسْأَلَ عَنْ عُمُرِهِ فِيمَا أَفْنَاهُ، وَعَنْ عِلْمِهِ فِيمَ فَعَلَ، وَعَنْ مَالِهِ مِنْ أَيْنَ اكْتَسَبَهُ وَفِيمَ أَنْفَقَهُ، وَعَنْ جِسْمِهِ فِيمَ أَبْلَاهُ».
[صحيح] - [رواه الترمذي] - [سنن الترمذي: 2417]
المزيــد ...
అబూ బర్జహ్ అల్ అస్లమీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“పునరుత్థాన దినము నాడు, కొన్ని విషయాలను గురించి ప్రశ్నించనంత వరకు, మానవుడి కాళ్ళు అతడు నిలుచుని ఉన్నచోటు నుండి ఏమాత్రమూ కదలవు – అతడి జీవితాన్ని గురించి – అతడు దానిని ఎందులో గడిపినాడు అని; అతడి జ్ఞానాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా ఉపయోగించినాడు అని; అతడి సంపదను గురించి – ఎక్కడి నుండి సంపాదించినాడు అని, మరియు దానిని ఎక్కడ ఖర్చు చేసినాడు అని; మరియు అతడి శరీరాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా పరిసమాప్తి గావించినాడు (ఏ విధంగా ఉపయోగించినాడు) అని.
[దృఢమైనది] - [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు] - [سنن الترمذي - 2417]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: పునరూత్థాన దినమున ప్రజలలో ఏ ఒక్కరు కూడా తమ తమ స్థానాల నుండి – వారిని కొన్ని విషయాల గురించి ప్రశ్నించబడే దాకా – స్వర్గం వైపునకు లేదా నరకం వైపునకు ఒక్క అడుగు కూడా కదపలేరు.
మొదటిది: అతడి జీవితాన్ని గురించి – అతడు ఎలా గడిపాడు మరియు దేనిలో అంతం చేశాడు?
రెండవది: అతడి జ్ఞానాన్ని గురించి – అతడు జ్ఞానాన్ని కేవలం అల్లాహ్ (యొక్క కరుణా కటాక్షాల) కొరకు మాత్రమే ఆర్జించినాడా? ఆర్జించిన జ్ఞానము ప్రకారం ఆచరించినాడా? మరియు ఆ జ్ఞానాన్ని అర్హులకు చేరవేసినాడా?
మూడవది: అతడి సంపద గురించి: ఎక్కడినుండి సంపాదించినాడు? అది ధర్మబద్ధంగా ఆర్జించినదా లేక అధర్మంగా ఆర్జించినదా? ఆ సంపదను దేనిపై ఖర్చు చేసినాడు? అల్లాహ్ ఇష్టపడే వాటిపై ఖర్చు చేసినాడా లేక అల్లాహ్ కు అయిష్టమైన వాటిపై ఖర్చు చేసినాడా?
నాలుగవది: అతడి శరీరము, శక్తి, ఆరోగ్యము మరియు యవ్వనం గురించి: అతడు వాటిని ఏవిధంగా వినియోగించినాడు మరియు వాటిని ఏవిధంగా ఉపయోగించినాడు?