«إِنَّ اللهَ لَا يَنْظُرُ إِلَى صُوَرِكُمْ وَأَمْوَالِكُمْ، وَلَكِنْ يَنْظُرُ إِلَى قُلُوبِكُمْ وَأَعْمَالِكُمْ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2564]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“నిశ్చయంగా అల్లాహ్ మీ బాహ్య రూపాన్ని గానీ లేక మీ సంపదలను గానీ చూడడు. కానీ మీ హృదయాలను మరియు మీ ఆచరణలను చూస్తాడు”.
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విషయాన్ని ఇలా విశదీకరిస్తున్నారు – పరమ పవిత్రుడు, మరమోన్నతుడు అయిన అల్లాహ్ తన దాసుల బాహ్య రూపాలను చూడడు, అవి అందమైనవా లేక అందవికారమైనవా, అవి పెద్ద శరీరాలా లేక చిన్న శరీరాలా, ఆరోగ్య వంతమైనవా లేక వ్యాధిగ్రస్థమైనవా అని. అలాగే అల్లాహ్ తన దాసుల సంపదలను చూడడు అవి కొద్దిపాటి సంపదలా లేక చాలా పెద్ద సంపదలా అని. మహోన్నతుడు, సర్వ శక్తి మంతుడు అయిన అల్లాహ్ తన దాసుల యొక్క ఈ విషయాల లెక్క చూడడు, సంపదలలోని తారతమ్యాలను, హెచ్చుతగ్గులను చూడడు. కానీ అల్లాహ్ వారి హృదయాలను చూస్తాడు. అందులో అల్లాహ్ పట్ల ఉన్న భయభక్తులను, విశ్వాసాన్ని చూస్తాడు. అందులోని సత్యాన్ని, మరియు స్వచ్ఛతను చూస్తాడు. లేక ఇతరులు చూసి మెచ్చుకోవాలని లేదా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనే సంకల్పం ఉన్నదా అని చూస్తాడు. వారి ఆచరణలను చూస్తాడు – అవి ధర్మబద్ధమైనవా లేక భ్రష్ఠ ఆచరణలా అని, వాటి ఆధారంగా వారికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.