عَنْ أَبِي الزُّبَيْرِ قَالَ:
كَانَ ابْنُ الزُّبَيْرِ يَقُولُ فِي دُبُرِ كُلِّ صَلَاةٍ حِينَ يُسَلِّمُ: «لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ، لَا إِلَهَ إِلَّا اللهُ، وَلَا نَعْبُدُ إِلَّا إِيَّاهُ، لَهُ النِّعْمَةُ وَلَهُ الْفَضْلُ وَلَهُ الثَّنَاءُ الْحَسَنُ، لَا إِلَهَ إِلَّا اللهُ مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ» وَقَالَ: «كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يُهَلِّلُ بِهِنَّ دُبُرَ كُلِّ صَلَاةٍ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 594]
المزيــد ...
అబూ జుబైర్ రజియల్లాహు అన్హు సలాహ్ (నమాజు) ముగించిన ప్రతిసారీ ఈ విధంగా అల్లాహ్ ను స్తుతించేవారు:
“లా ఇలాహా ఇల్లల్లాహు వహ్’దహు లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హమ్’దు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహు, వలా న’బుదు ఇల్లా ఇయ్యాహు, లహున్నే’మతు, వ లహుల్ ఫధ్’లు, వ లహుథ్థనాఉల్ హసను, లా ఇలాహ ఇల్లల్లాహు, ముఖ్లిసీన, లహుద్దీన, వలౌ కరిహల్ కాఫిరూన్” (అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు, ఆయనకు ఎవ్వరూ సాటి (సమానులు) లేరు, విశ్వసామ్రాజ్యము ఆయనదే, మరియు సకల ప్రశంసలూ ఆయనకే; ఆయన ప్రతి విషయముపై అధికారము కలవాడు. అల్లాహ్ (అనుమతి) తో తప్ప ఏ శక్తీ, సామర్థ్యము, ఆధిపత్యము సాధ్యము కాదు, అల్లాహ్ తప్ప నిజఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు మేము కేవలం ఆయనను తప్ప వేరెవ్వరినీ ఆరాధించము, సకల సంపద, దాతృత్వము, వదాన్యత ఆయనదే, దయ, కరుణ, కటాక్షము ఆయనవే; అన్నిరకాల శ్రేష్ఠమైన, విశిష్టమైన స్తోత్రములు, ప్రశంసలూ ఆయనకే చెందుతాయి, మరియు అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. అవిశ్వాసులు ఎంత ద్వేషించినా, ఏవగించుకున్నా మా భక్తిని, అంకితభావాన్ని, సకల ఆరాధనా రీతులను కేవలం ఆయనకు మాత్రమే ప్రత్యేకించినాము). అబ్దుల్లాహ్ ఇబ్న్ అజ్జుబైర్ ఇలా అన్నారు: “ సలాహ్ (నమాజు) ముగించిన ప్రతిసారీ రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ పదాలతో అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడేవారు.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 594]
ప్రతి ఫర్జ్ సలాహ్ ను (ప్రతి ఫర్జ్ నమాజును) సలాంతో ముగించిన తరువాత ప్రతిసారీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఘనమైన ఈ స్తోత్రాన్ని పఠించే వారు; దాని అర్థం ఏమిటంటే:
“లా ఇలాహ ఇల్లల్లాహ్” అంటే “అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజఆరాధ్యుడు ఎవరూ లేరు”.
“వహ్’దహు, లా షరీకలహు” అంటే “ఆయన ఏకైకుడు”, “ఆయనకు ఎవ్వరూ సాటి లేరు” అని అర్థం; అంటే ఆయన ‘ఉలూహియత్’లో (ఉలూహియత్: ‘సకల ఆరాధనలకు ఏకైక నిజ ఆరాధ్యుడు, అంటే ఆయన ‘ఇలాహ్’ కావడంలో); ఆయన ‘రుబూబియత్’లో (రుబూబియత్: విశ్వ సామ్రాజ్యానికి ‘ప్రభువు’ (రబ్) కావడంలో, అంటే ఆయన ప్రభుతలో), మరియు ఆయన ‘అస్మా వస్సిఫాత్’లో (అస్మా వస్సిఫాత్: ఆయన నామములు (పేర్లు) మరియు గుణగణములలో) తనకు సాటి, సమానులూ ఎవ్వరూ లేనివాడని అర్థము.
“లహుల్ ముల్క్” అంటే: బ్రహ్మాండమైన విస్తృతి కలిగి, సార్వజనికమైన, విశాలమైన, భూమీ మరియు ఆకాశాలు కలిగిన ఈ సంపూర్ణ బృహద్విశ్వము, అంటే ఈ భూమీ, ఆకాశాలు మరియు వాటి మధ్య నున్న ప్రతిదీ ఆయనకు చెందినదే, ప్రతిదానిపై అధికారము ఆయనదే.
“వ లహుల్ హందు” అంటే: ఆయన ఘనతకు తగిన ప్రతి విషయము నూ అల్లాహ్ ఎలాంటి లోపమూ లేని పరిపూర్ణత గలవాడు. కనుక మంచి పరిస్థితులలో గానీ, లేక చెడు పరిస్థితులలో గానీ - ప్రేమ, గౌరవం మరియు పూజ్య భావనతో చేసే పరిపూర్ణమైన ప్రతి ప్రశంస, స్తుతి ఆయనకు చెందినదే.
“వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్” అంటే: “ఆయన ప్రతి విషయముపై అధికారము కలవాడు” అని అర్థము. అంటే, ఏ విషయానికి సంబంధించి అయినా ఆయన శక్తి అపారమైనది, పరిపూర్ణమైనది, పరిమితులు లేనిది. ఆయన సామర్థ్యము పరిధిలో లేని ఏ విషయమూ లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు.
“లా హౌల వలా ఖువ్వత ఇల్లాబిల్లాహ్” అంటే: “అల్లాహ్ (అనుమతి) తో తప్ప ఏ శక్తీ, సామర్థ్యము, ఆధిపత్యము సాధ్యము కాదు” (అంటే, శక్తీ, సామర్థ్యము,ఆధిపత్యము అన్నీ అల్లాహ్’తోనే సాధ్యము) అని అర్థము. ఒక స్థితి నుండి మరొక స్థితికి లేదా ఒక పరిస్థితి నుండి మరొక పరిస్థితికి మారాలన్నా, మరియు అల్లాహ్ కు అవిధేయుడిగా ఉన్న స్థితి నుండి విధేయుడి స్థితికి చేరుకోవాలన్నా, ఆ శక్తీ సామర్థ్యము కేవలం అల్లాహ్’తోనే సాధ్యము (అంటే ఆయన వాటిని ప్రసాదిస్తేనే సాధ్యము). ఆయనే సహాయం చేసేవాడు మరియు ఆయన పైనే మన నమ్మకం, భరోసా.
“లా ఇలాహ ఇల్లల్లాహు, వలా న’బుదు ఇల్లా ఇయ్యాహు” అంటే: “అల్లాహ్ తప్ప నిజఆరాధ్యుడు ఎవరూ లేరు మరియు మేము కేవలం ఆయనను తప్ప వేరెవ్వరినీ ఆరాధించము” అని అర్థము. ఈ అర్థములో బరువు (దృష్టి) మొత్తము అల్లాహ్ యొక్క తౌహీద్ పై, మరియు తద్వారా అనేక దేవుళ్ల ఆరాధన (బహుదైవారాధన) యొక్క ఖండన అను విషయములపై కేంద్రీకృతమై ఉన్నది. అందుకనే ఆయన తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు.
“లహున్నే’మతు, వలహుల్ ఫధ్’లు” అంటే: “సకల సంపదలు, సకల శుభాలు, దాతృత్వము, వదాన్యత ఆయనదే, దయ, కరుణ, కటాక్షము ఆయనవే” అని అర్థము. అనగా, సంపదల మరియు శుభాల సృష్ఠికర్త ఆయనే, వాటి స్వామి, ప్రభువు, యజమాని ఆయనే. వాటిని తన దాసులలో తాను కోరిన వారికి, తాను తలచిన వారికి ప్రసాదించి వారిని అనుగ్రహిస్తాడు.
“వ లహుస్సనాఉల్ హసను” అంటే: “అన్నిరకాల శ్రేష్ఠమైన, విశిష్టమైన స్తోత్రములు, ప్రశంసలూ ఆయనకే చెందుతాయి” అని అర్థము. అంటే స్వయంగా ఆయన అస్తిత్వానికి సంబంధించి, ఆయన గుణగణములకు సంబంధించి, ఆయన శుభాలకు సంబంధించి, ఆయన ఘనతకు సంబంధించి - ఏ స్థితిలోనైనా, ఏ సందర్భములోనైనా చేసే అన్నిరకాల శ్రేష్ఠమైన, విశిష్టమైన స్తోత్రములు, ప్రశంసలూ ఆయనకే చెందుతాయి.
“లా ఇలాహ ఇల్లల్లాహు, ముఖ్లిసీన, లహుద్దీన” అంటే: "అల్లాహ్ తప్ప నిజఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. మా భక్తిని, అంకితభావాన్ని, సకల ఆరాధనా రీతులను కేవలం ఆయనకు మాత్రమే ప్రత్యేకించినాము” అని అర్థము. అనగా, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించేవారు (మువహ్హిదీన్ - ఏకదైవారాధకులు) తమ భక్తిని, అంకితభావాన్ని, సకల ఆరాధనా రీతులను ఎటువంటి ప్రదర్శనా భావము లేకుండా, ఎలాంటి కపటత్వము లేకుండా ఆయనకు మాత్రమే ప్రత్యేకిస్తారు.
“వలౌ కరిహల్ కాఫిరూన్” అంటే: “అవిశ్వాసులు ఎంత ద్వేషించినా, ఏవగించుకున్నా” అని అర్థము. అనగా, అనేక దేవుళ్లను కాకుండా కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుటలో దృఢత్వాన్ని, స్థిరచిత్తాన్ని కలిగి ఉండుట - అలా చేయడం అవిశ్వాసులకు ఎంత అయిష్టమైనదైనా సరే.