عن أنس بن مالك رضي الله عنه:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَمُعَاذٌ رَدِيفُهُ عَلَى الرَّحْلِ قَالَ: «يَا مُعَاذُ بْنَ جَبَلٍ»، قَالَ: لَبَّيْكَ يَا رَسُولَ اللهِ وَسَعْدَيْكَ، قَالَ: «يَا مُعَاذُ»، قَالَ: لَبَّيْكَ يَا رَسُولَ اللهِ وَسَعْدَيْكَ، ثَلَاثًا، قَالَ: «مَا مِنْ أَحَدٍ يَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ صِدْقًا مِنْ قَلْبِهِ إِلَّا حَرَّمَهُ اللهُ عَلَى النَّارِ»، قَالَ: يَا رَسُولَ اللهِ، أَفَلَا أُخْبِرُ بِهِ النَّاسَ فَيَسْتَبْشِرُوا؟ قَالَ: «إِذًا يَتَّكِلُوا». وَأَخْبَرَ بِهَا مُعَاذٌ عِنْدَ مَوْتِهِ تَأَثُّمًا.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 128]
المزيــد ...
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
(ఒక ప్రయాణములో) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక వాహనముపై కూర్చుని ఉండగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “ఓ ముఆధ్ ఇబ్న్ జబల్”. దానికి ఆయన “మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి “ఓ ముఆధ్!” అన్నారు. ఆయన తిరిగి “మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి మూడవసారి కూడా అదే విధంగా జరిగింది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే “సత్యపూర్వకముగా తన సంపూర్ణ హృదయముతో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మద ర్రసూలుల్లాహ్’ (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు) సాక్ష్యమిస్తాడో, అల్లాహ్ నరకాగ్నిని అతనిపై నిషేధిస్తాడు.” అది విని ముఆధ్ “ఓ రసూలుల్లాహ్! ఈ వార్తను నేను మిగతా వారందరికీ వినిపించనా, వారు సంతోషిస్తారు” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “వద్దు, అలా చేస్తే వారు ఈ ఒక్క దానిపైనే ఆధారపడతారు (అంటే మిగతా సత్కార్యాలు చేయడం పట్ల ఆసక్తి చూపకుండా)” అన్నారు. ముఆధ్ రజియల్లాహు అన్హు తన మరణశయ్యపై ఉండి ఈ హదీసును ఉల్లేఖించినారు – జ్ఞానాన్ని ఇతరులకు చేరవేయకుండా దాచుకున్న పాపమునకు తాను లోను కారాదనే భయంతో.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 128]
ముఆధ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒంటె పై వారి వెనుక కూర్చుని ఉన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఓ ముఆధ్!” అని పిలిచారు. (ఆయన జవాబిచ్చినప్పటికీ) అలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లు మరల మరల ముఆధ్ రజియల్లాహు అన్హు ను పిలిచారు. ఆయన చెప్పబోయే విషయం ఎంత ముఖ్యమైనదో తెలియజేయడానికి.
మూడు సార్లూ కూడా ముఆధ్ రజియల్లాహు అన్హు “మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్” అని సమాధానమిచ్చారు. అంటే దాని అర్థం “మీరు మరలమరల పిలిచినా నేను మరల మరల ఇదే సమాధానం ఇస్తాను, (ఎందుకంటే, ఓ రసూలుల్లాహ్) మీ సేవలో హాజరుగా ఉన్నాను అని సమాధనం ఇవ్వడమే నాకు సంతోషం”.
అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసారు “ఎవరైతే “లా ఇలాహ ఇల్లల్లాహ్” అంటే “అల్లాహ్ తప్ప, ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు” అని మరియు మ”ముహమ్మదుర్రసూలుల్లాహ్”, అంటే “ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు” అని సత్యపూర్వకంగా మరియు పూర్తి హృదయంతో, అందులో ఏ మాత్రమూ అసత్యము లేకుండా సాక్ష్యమిస్తాడొ, ఒకవేళ అతడు అదే అవస్థలో (తాను పలికిన సాక్ష్యాన్ని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్న స్థితిలో) చనిపోయినట్లయితే, అతనిపై (అటువంటి వానిపై) అల్లాహ్ నరకాగ్నిని నిషేధించినాడు.
అదివిని ముఆధ్ రజియల్లాహు అన్హు తాను ఈ శుభవారను అందరికీ వినిపిస్తానని, అది విని అందరూ మిక్కిలిగా సంతోషపడతారని, అనుమతించమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ని అడుగుతారు.
దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా చేయవద్దని వారించినారు – ప్రజలు ఈ ఒక్క విషయం పైనే ఆధారపడి మిగతా ఆచరణలను తక్కువ చేస్తారనే భయంతో.
ముఆధ్ రజియల్లాహు అన్హు ఈ విషయాన్ని తాను చనిపోవడానికి ముందు వరకూ ఎవరికీ తెలియజేయలేదు. ఙ్ఞానమును ఇతరులకు చేరవేయకుండా దాచిపెట్టిన వాడి పాపానికి లోనవుతానేమో అనే భయంతో చనిపోవడానికి ముందు ఆయన ఈ విషయాన్ని అందరికీ తెలియజేసారు.