عَنِ الحُسَينِ بنِ عَلِيٍّ بنِ أَبِي طَالِبٍ رضي الله عنهما قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«الْبَخِيلُ مَنْ ذُكِرْتُ عِنْدَهُ فَلَمْ يُصَلِّ عَلَيَّ».
[صحيح] - [رواه الترمذي والنسائي في الكبرى وأحمد] - [السنن الكبرى للنسائي: 8046]
المزيــد ...
అల్ హుస్సేన్ ఇబ్న్ అలీ ఇబ్న్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“పిసినారి ఎవరంటే, తన సమక్షములో నా ప్రస్తావన వచ్చినప్పటికీ నాపై అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు మరియు దీవెనల కొరకు ప్రార్ధించని వాడు (దరూద్ పఠించనివాడు).”
[దృఢమైనది] - - [السنن الكبرى للنسائي - 8046]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన పేరు గానీ, మారు పేరు గానీ లేక తన వర్ణన గానీ ప్రస్తావించబడినప్పుడు తనపై అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు మరియు దీవెనల కొరకు ప్రార్థించకుండా (దరూద్ చదవకుండా) ఉండరాదని హెచ్చరించినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అసలైన పిసినారి ఎవరంటే, ఎవరైతే నాపై అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు మరియు దీవెనల కొరకు ప్రార్థించడో (దరూద్ చదవడో)”. దీనికి అనేక కారణాలున్నాయి:
మొదటిది: చిన్నదైనా, పెద్దదైనా తనకు ఎటువంటి నష్టమూ కలిగించని, మరియు దాని కొరకు అతడు ఎటువంటి ఖర్చూ చేయనవసరం లేని, ఎటువంటి కష్టమూ పడనవసరం లేని విషయంలో అతడు పిసినారిగా ప్రవర్తించినాడు.
రెండవది: అతడు తన పట్ల తానే పిసినారితనం చూపుకున్నాడు. తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు మరియు దీవెనల కొరకు ప్రార్థించుట (దరూద్ పంపుట) వలన అతనికి లభించే ప్రతిఫలం నుండి దూరమై పోయినాడు. ఎందుకంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై శుభాల కొరకు ప్రార్థించకుండా ఉండిపోయి తన పట్ల తానే పిసినారితనం చేసుకున్నాడు; ఆదేశపాలన చేయడం అతని పై ఉన్న విధి, ఆ విధిని నెరవేర్చకుండా దూరంగా ఉండిపోయాడు, తద్వారా అతనికి లభించే ప్రతిఫలం నుండి కూడా తనను తాను వంచించుకొన్నాడు.
మూడవది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు మరియు దీవెనల కొరకు ప్రార్థించడం, ఆయనకు మనపై ఉన్న హక్కులలో ఒకటి, ఎందుకంటే ఆయనే మనకు ధర్మాన్ని బోధించినారు, మనకు మార్గదర్శకం చేసినారు; సర్వోన్నతుడైన అల్లాహ్ వైపునకు మనకు పిలుపునిచ్చినారు; ఆయనే మనకు ఈ వహీని (దివ్యవాణిని) మరియు ఈ షరియత్ ను అందజేసినారు. మనకు సన్మార్గ దర్శకం లభించడానికి కారణం సర్వోన్నతుడైన అల్లాహ్ తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాత్రమే. కనుక ఎవరైతే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు మరియు దీవెనల కొరకు ప్రార్థించడో (దరూద్ పంపడో) అతడు తన పట్ల తాను పిసినారితనానికి పాల్బడినాడు, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హక్కులలో ఒక కనీస హక్కును తీర్చడం పట్ల పిసినారితనం వహించినాడు.