عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ نَفَّسَ عَنْ مُؤْمِنٍ كُرْبَةً مِنْ كُرَبِ الدُّنْيَا نَفَّسَ اللهُ عَنْهُ كُرْبَةً مِنْ كُرَبِ يَوْمِ الْقِيَامَةِ، وَمَنْ يَسَّرَ عَلَى مُعْسِرٍ يَسَّرَ اللهُ عَلَيْهِ فِي الدُّنْيَا وَالْآخِرَةِ، وَمَنْ سَتَرَ مُسْلِمًا سَتَرَهُ اللهُ فِي الدُّنْيَا وَالْآخِرَةِ، وَاللهُ فِي عَوْنِ الْعَبْدِ مَا كَانَ الْعَبْدُ فِي عَوْنِ أَخِيهِ، وَمَنْ سَلَكَ طَرِيقًا يَلْتَمِسُ فِيهِ عِلْمًا سَهَّلَ اللهُ لَهُ بِهِ طَرِيقًا إِلَى الْجَنَّةِ، وَمَا اجْتَمَعَ قَوْمٌ فِي بَيْتٍ مِنْ بُيُوتِ اللهِ يَتْلُونَ كِتَابَ اللهِ وَيَتَدَارَسُونَهُ بَيْنَهُمْ إِلَّا نَزَلَتْ عَلَيْهِمِ السَّكِينَةُ، وَغَشِيَتْهُمُ الرَّحْمَةُ، وَحَفَّتْهُمُ الْمَلَائِكَةُ، وَذَكَرَهُمُ اللهُ فِيمَنْ عِنْدَهُ، وَمَنْ بَطَّأَ بِهِ عَمَلُهُ لَمْ يُسْرِعْ بِهِ نَسَبُهُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2699]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"ఎవరైతే ఒక విశ్వాసిని ఈ ప్రాపంచిక కష్టాలలోని ఒక కష్టం నుండి విముక్తి చేస్తారో, ప్రళయ దినాన అల్లాహ్ అతడిని ఒక కష్టం నుండి విముక్తి చేస్తాడు. ఎవరైతే ఒక కష్టంలో ఉన్నవారి కష్టాన్ని సులభతరం చేస్తాడో, అల్లాహ్ ఈ ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అతని కష్టాన్ని సులభతరం చేస్తాడు. ఎవరైతే తోటి ముస్లిం లోపాలను దాచిపెడతారో, అల్లాహ్ ఈ ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అతని లోపాల్ని దాచి పెడతాడు. అల్లాహ్ యొక్క దాసుడు (ముస్లిం) తన తోటి సోదరునికి సహాయం చేస్తున్నంత కాలం, అల్లాహ్ కూడా ఆ దాసుడికి సహాయం చేస్తాడు. ఎవరైతే జ్ఞానం అన్వేషించే మార్గంలో నడుస్తారో, అల్లాహ్ అతనికి స్వర్గానికి చేర్చే మార్గాన్ని సులభతరం చేస్తాడు. అల్లాహ్ యొక్క గృహాలలో (మస్జిదులలో) నుండి ఒక గృహంలో ప్రజల సమూహం ఒక చోట చేరి, అల్లాహ్ గ్రంథాన్ని పఠిస్తూ, దాన్ని తమలో తాము అధ్యయనం చేస్తుంటే, అల్లాహ్ యొక్క ప్రశాంతత ఆ సమూహంపై వర్షిస్తుంది, ఆయన దయ వారిని ఆవరిస్తుంది, దైవదూతలు వారిని చుట్టుముట్టుతారు మరియు అల్లాహ్ తన సన్నిధిలో ఉన్న వారితో, ఆ సమూహం గురించి ప్రస్తావిస్తాడు. మరియు ఎవరి కర్మలు వారిని వెనుకబడేలా చేస్తాయో, వారి వంశం కూడా వారిని ముందుకు తీసుకు రాలేదు."
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2699]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా ఇలా తెలిపినారు: ఒక ముస్లిమ్ తన తోటి ముస్లిమ్ సోదరుడి కోసం చేసే పనులకు తగినట్లుగా అల్లాహ్ అతనికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ఈ లోకంలో ఎవరు ఒక విశ్వాసి కష్టాన్ని నివారిస్తారో, లేదా తగ్గిస్తారో, లేదా పూర్తిగా తొలగిస్తారో, తీర్పు దినాన అల్లాహ్ కూడా అతని నుండి ఒక కష్టాన్ని తొలగిస్తాడు. ఎవరైనా కష్టంలో ఉన్నవారి కష్టాన్ని సులభతరం చేస్తే, అల్లాహ్ అతని కష్టాన్ని ఈ లోకంలోనూ, పరలోకంలోనూ సులభతరం చేస్తాడు. ఎవరైతే ఒక ముస్లిమ్ యొక్క లోపాన్ని దాచిపెడతారో, అంటే ఇతరులకు తెలియకుండా అతడు చేసిన తప్పులను, పొరపాట్లను దాచిపెడతారో, అల్లాహ్ కూడా అతని లోపాలను, తప్పులను, పొరపాట్లను ఈ లోకంలోనూ, పరలోకంలోనూ దాచి పెడతాడు. తన దాసుడు తన తోటి సహోదరుని ధార్మిక, ప్రాపంచిక ప్రయోజనాల్లో సహాయం చేస్తూ ఉన్నంత వరకు, అల్లాహ్ కూడా ఆ దాసుడికి సహాయంగా ఉంటాడు. ఈ సహాయం దుఆ, ఆచరణలు, సంపద ద్వారా కావచ్చు. ఎవరైనా అల్లాహ్ కోసం ధార్మిక జ్ఞానం సంపాదించేందుకు ప్రయాణిస్తారో, అల్లాహ్ అతని కొరకు స్వర్గం దారిని సులభతరం చేస్తాడు. అల్లాహ్ ఆరాధనా గృహాలలో (మస్జిదులలో) ఒక సమూహం అల్లాహ్ యొక్క గ్రంథాన్ని (ఖుర్ఆన్) పఠిస్తూ, పరస్పరం అధ్యయనం చేస్తూ ఉంటే, వారిపై ప్రశాంతత వర్షిస్తుంది; అల్లాహ్ కరుణ వారిని ఆవరిస్తుంది; దైవదూతలు వారిని చుట్టుముట్టుతారు; అల్లాహ్ ఆ సమూహం గురించి తన సమీపంలో ఉన్న వారి వద్ద ప్రశంసిస్తాడు. అల్లాహ్ తన దాసుడిని పరమోన్నతమైన సంఘంలో ప్రస్తావించడం ఎంత గొప్ప గౌరవమో కదా! ఎవరి వద్ద మంచి పనులు తక్కువగా ఉంటాయో, అతను ఎక్కువ మంచి పనులు చేసిన వారి స్థాయికి చేరుకోలేడు. కాబట్టి, స్వయంగా మంచి పనులు చేయకుండా తన వంశము, కులము పేరు మీద ఆధారపడకూడదు.