అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా పలికినాడు: నా దాసుడు నా గురించి ఏమని భావిస్తాడో, నేను అతడు భావించినట్లుగానే అతనితో ఉంటాను; అతను తనలో తాను నన్ను స్మరించినప్పుడు నాలో నేను అతడిని స్మరిస్తాను; ఒకవేళ అతడు నన్ను ఏదైనా సమావేశములో స్మరించినట్లయితే, అంతకంటే ఉత్తమమైన సమావేశములో నేను అతడిని ప్రస్తావిస్తాను; ఒకవేళ అతడు ఒక ‘షిబ్ర్’ అంత (జానెడంత) నాకు చేరువ అయితే, నేను ఒక ‘దిరా’ అంత (ఒక మూరెడు) అతనికి చేరువ అవుతాను; ఒకవేళ అతడు ఒక ‘దిరా’ అంత నాకు చేరువ అయితే, నేను ఒక “బాఅ” అంత (ఒక బారెడు) అతనికి చేరువ అవుతాను; ఒకవేళ అతడు నా వైపు నడుచుకుంటూ వస్తే, నేను అతని వైపునకు పరుగెత్తుకుంటూ వస్తాను.” [ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] - [సహీహ్ ముస్లిం - 2675]
వివరణ
సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా పలికినాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినారు:
నేను నా దాసుని పట్ల ఆ విధంగానే ఉంటాను, ఏ విధంగానైతే అతడు నన్ను తలపోస్తాడో; కనుక నా దాసుడు, క్షమాభిక్ష యొక్క ఆశ మరియు ఆపేక్షల ద్వారా నా పట్ల ఏ విధమైన భావం కలిగి ఉంటాడో నేను అతడిని ఆ విధంగా ఆదరిస్తాను, అతడు నా నుంచి మంచి లేక మరో విధంగా ఏదైనా ఆశించి నట్లతే నేను అతనిపట్ల అది చేస్తాను. అతను నన్ను స్మరించినట్లయితే నేను అతనితో దయ, విజయం, మార్గదర్శకత్వం, సంరక్షణ మరియు మద్దతులతో అతనితో ఉంటాను.
ఒకవేళ అతడు ఒంటరిగా ఉన్నపుడు, తన మనసులో, తన ఏకాంతములో నన్ను స్మరించినట్లయితే నేను అతడిని నాలో నేను గుర్తు చేస్తాను.
ఒకవేళ అతడు నన్ను ఏదైనా సమావేశములో నన్ను స్మరించినట్లయితే, నేను అతడిని అంత కంటే ఎక్కువ సంఖ్యగల సమావేశములో, వారి కంటే ఉత్తములైన వారి సమావేశములో అతడిని నేను ప్రస్తావిస్తాను.
ఒకవేళ అతడు ఒక జానెడంత అల్లాహ్’కు చేరువగా వచ్చినట్లయితే, అల్లాహ్ అతడిని ఉన్నతం చేస్తాడు, తద్వారా అల్లాహ్ అతనికి ఒక మూరెడు చేరువ అవుతాడు.
ఒకవేళ అతడు అల్లాహ్’కు ఒక మూరెడు చేరువ అయితే, అల్లాహ్ అతనికి ఒక బారెడు చేరువ అవుతాడు.
ఒకవేళ అతడు అల్లాహ్ వైపునకు నడుచుకుంటూ వచ్చినట్లయితే, అల్లాహ్ అతని వైపునకు పరుగెత్తుకుంటూ వస్తాడు.
దాసుడు తన ప్రభువుకు విధేయత ద్వారా, మరియు (చెడును వదిలి) ఆయన వైపునకు మరలుట ద్వారా ఆయనకు చేరువ అయితే, అతడు ఆచరించిన దానికి సమానంగా, ప్రతిఫలంగా అల్లాహ్ అతనికి తన సాన్నిహిత్యాన్ని వృద్ధిచేస్తాడు.
తన ప్రభువైన అల్లాహ్ పట్ల దాసుని యొక్క దాస్యము ఎంత పరిపూర్ణంగా ఉంటుందో, అతను సర్వశక్తిమంతుడైన అల్లాహ్’కి అంత దగ్గరగా ఉంటాడు. అల్లాహ్ ఏదైనా ప్రసాదించుట మరియు దాని ప్రతిఫలం దాసుని ఆచరణ మరియు అతని శ్రమకంటే గొప్పవి. ఫలితంగా అల్లాహ్’నుండి లభించే ప్రతిఫలం నాణ్యత మరియు పరిమాణం పరంగా అతని ఆచరణ కంటే ఎక్కువగా ఉంటుంది.
ఆ విధంగా ఒక విశ్వాసి అల్లాహ్ పట్ల మంచి ఆపేక్ష కలిగి ఉంటాడు, మంచి పనులు చేయడంలో మునిగిపోతాడు, వాటిని మరింత వేగవంతం చేస్తాడు, అల్లాహ్’ను కలుసుకునే వరకు అతడు ఆవిధంగా చేస్తూనే ఉంటాడు.
من فوائد الحديث
ఈ హదీథ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తన ప్రభువు నుండి ఉల్లేఖించిన హదీథులలో ఒకటి, దీనిని ‘అల్ హదీథ్ అల్ ఖుద్సీ’ లేదా ‘దైవప్రేరితమైన హదీథ్’ అంటారు. ‘హదీథ్ అల్ ఖుద్సీ’ యొక్క పదాలు మరియు అర్థము అల్లాహ్ తరఫు నుండి అయి ఉంటాయి. ఇది దైవప్రేరితం అయినప్పటికీ, ఖుర్’ఆన్ యొక్క ప్రత్యేకతలను కలిగి ఉండదు. ఖుర్’ఆన్’కు వేరే ఏ ఇతర గద్యమునకు గానీ, వచనమునకు గానీ, లేని ప్రత్యేకతలు ఉన్నాయి. ఉదాహరణకు ఖుర్’ఆన్ పఠనము అనేది ఒక ఆరాధన (ఇబాదత్); ఖుర్’ఆన్ ను చేతులలోనికి తీసుకుని పఠించుట కొరకు విధిగా ఉదూ చేసి ఉండాలి. ఖుర్’ఆన్ ప్రపంచం మొత్తానికి ఒక సవాలు వంటిది; ఖుర్’ఆన్ యొక్క ప్రత్యేకతలలో దాని అద్భుతత్వం కూడా ఒకటి. ఇంకా ఇటువంటి అనేక ప్రత్యేకతలను ఖుర్’ఆన్ కలిగి ఉంది.
అల్ అజుర్రీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “సత్యవంతులైన ప్రజలు సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ను, ఆ విధంగానే వర్ణిస్తారు, ఏవిధంగానైతే ఆయన తనను తాను వర్ణించుకున్నాడో; ఆ విధంగానే వర్ణిస్తారు, ఏవిధంగానైతే ఆయన సందేశహరుడు ఆయనను వర్ణించినాడో; మరియు ఆ విధంగానే వర్ణిస్తారు, ఏవిధంగానైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబాలు ఆయనను వర్ణించినారో. ఇది ధర్మ పండితులు అనుసరించిన సిద్ధాంతం, వారు కొత్తగా దీనిని ఆవిష్కరించలేదు, కొత్తగా తీసుకుని రాలేదు.” అహ్లుస్సున్నహ్ యొక్క విధానము ఇదే. అల్లాహ్ తన నామములను, తన గుణవిశేషాలను ఏమని స్థిరపరిచినాడో, అహ్ల్’స్సున్నహ్ ధర్మపండితులు వాటి అర్థాలను వక్రీకరించడం, మార్చడం చేయకుండా (తహ్’రీఫ్ చేయకుండా); వాటి అర్థాలను నిరాకరించడం, లేదా తిరస్కరించడం చేయకుండా (త’తీల్ చేయకుండా), వాటి అర్థాలను “ఎలా?” అని ప్రశ్నించడం, లేదా “ఇలా అయి ఉంటుంది” అని ఊహాగానాలు చేయడం లాంటిది చేయకుండా (తక్’యీఫ్ చేయకుండా); మరియు అల్లాహ్ యొక్క పేర్లు, ఆయన గుణవిశేషాలను ఆయన సృష్ఠితాలతో పోలిక ఇవ్వడం, పోల్చి చూపుతూ వివరించడం లాంటిది చేయకుండా (తమ్’సీల్ చేయకుండా) వాటిని అల్లాహ్ స్థిరపరిచినట్లుగానే స్థిరపరుస్తారు. అల్లాహ్ తనకు సంబంధించి ఏ విషయాలను తిరస్కరించినాడో, వారు ఆ విషయాలన్నింటినీ తిరస్కరిస్తారు; మరియు అల్లాహ్ చేత తిరస్కరించబడని, లేదా స్థిరపచబడని విషయాలపట్ల వారు (అహ్లుస్సున్నహ్ పండితులు) మౌనంగా ఉంటారు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తనను గురించి ఇలా అన్నాడు “లైస కమిథ్’లిహి షైఉన్, వహువస్సమీఉల్ బసీర్” (ఆయనకు పోలినది ఏదీలేదు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. సూరహ్ అష్-షూరా 40:11)
అల్లాహ్ పట్ల మంచి ఆశలు, మంచి అంచనాలు కలిగి ఉండడం అనేది మంచి ఆచరణలతో పాటుగా ఉండాలి. ఇమాం హసన్ అల్ బస్రీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “"విశ్వాసుడు తన ప్రభువును గురించి మంచిగా ఆలోచిస్తాడు, తద్వారా మంచి పనులు చేస్తాడు. మరియు దుర్మార్గుడు తన ప్రభువును గురించి చెడుగా ఆలోచిస్తాడు, తద్వారా చెడు పనులు చేస్తాడు.”
ఇమాం అల్-ఖుర్తుబి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: హదీథులో “నా దాసుడు నా గురించి ఏమని భావిస్తాడో, నా దాసుడు నాగురించి ఏ అభిప్రాయంతో ఉంటాడొ" అనే మాటలకు అర్థం, దాసుడు దుఆ చేసేటపుడు ఆ దుఆకు సమాధానం లభించడానికి సంబంధించి అతని భావన అని అర్థం; అతడు క్షమాభిక్ష కోరునపుడు, ఆ క్షమాభిక్ష ప్రసాదించబడుటకు సంబంధించి అతని భావన అని అర్థం; అలాగే అతడు ఏదైనా ఆరాధనను, దాని షరతులను అన్నిటినీ పాటిస్తూ ఆచరించినపుడు, ఆ ఆరాధనకు పుణ్యము, ప్రతిఫలము లభించడానికి సంబంధించి అతని భావన అని అర్థం; అంటే ఆ భావన అల్లాహ్ యొక్క సత్యవంతమైన ప్రమాణం పట్ల అచంచలమైన విశ్వాసముతో కూడినదై ఉండాలి అని అర్థము. కనుక దాసుడు, అల్లాహ్ నన్ను క్షమిస్తాడు మరియు నా ఆచరణలను స్వీకరిస్తాడు అనే ఖచ్చితమైన విశ్వాసంతో షరియత్’లో ఆదేశించబడిన ఆచరణలను తప్పనిసరిగా ఆచరిస్తూ ఉండాలి, ఎందుకంటే అల్లాహ్ ఆ విధంగా వాగ్దానం చేసినాడు కనుక, ఆయన తన వాగ్దానాన్ని ఎప్పుడూ భంగపరుచడు. ఒకవేళ దాసుడు ‘అల్లాహ్ నన్ను క్షమించడు, నా ఆచరణలను స్వీకరించడు’ అనే భావనతో ఉన్నట్లైతే, అది అతనికి ఏవిధంగానూ ప్రయోజనాన్ని కలిగించదు. పైగా అది అల్లాహ్ యొక్క దయ, కరుణల పట్ల నిరాశ, నిస్పృహలకు తార్కాణం అవుతుంది. అది ‘కబాయిర్’లలో (ఘోరమైన పాపములలొ) ఒకటి అవుతుంది. పై హదీథు యొక్క మరో కథనములో అల్లాహ్ ఈ విధంగా అన్నట్లుగా నమోదు చేయబడి ఉన్నది – “కనుక నా దాసుడిని నన్ను గురించి అతనికి ఇష్టమైన విధంగా భావించనివ్వండి”; అందుకని ఎవరైతే ఈ విధమైన విశ్వాస స్థితిలో చనిపోతాడో, అతడు అతని భావనకే వదిలివేయబడతాడు.” ఆయన ఇలా అన్నారు: “పాపాలను వదిలివేయకుండా క్షమాభిక్షను ఆశించడం, ఇది సంపూర్ణ అజ్ఞానం మరియు నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు.”
ఈ హదీథులో మీరు మీ హృదయాలలోనూ, మీ నాలుకతోనూ అల్లాహ్ ను ఎక్కువగా స్మరించాలి అనే ప్రోత్సాహము ఉన్నది. విశ్వాసి తనలో మరియు తన హృదయంలో అల్లాహ్’ పట్ల భయభక్తులు కలిగి ఉండాలి; అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని మరియు ఆయన హక్కును గుర్తుంచుకోవాలి; విశ్వాసి అల్లాహ్ ను ప్రార్థించాలి, దుఆ చేయాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను ప్రేమించాలి, ఆయన పట్ల మంచి భావనను కలిగి ఉండాలి, మరియు ఆచరణలను అన్నింటినీ ఆయనకు అంకితం చేయాలి; అతడు తన నాలుకతో "సుబహానల్లాహ్" (అల్లాహ్ పరమపవిత్రుడు), "అల్-హందులిల్లాహ్" (అన్ని రకాల స్తోత్రములు, కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే), "లా ఇల్లాహ్ ఇల్లల్లాహ్" (అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు ఎవరూ లేడు), "అల్లాహు అక్బర్" (అల్లాహ్ మహోన్నతుడు), మరియు "లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్" (అల్లాహ్ తోనే తప్ప శక్తి లేదు, మరియు ఆయనతోనే తప్ప బలమూ లేదు) అని పలుకుతూ ఉండాలి.
ఇబ్న్ అబీ జమ్రహ్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఎవరైతే, భయపడుతున్న స్థితిలో ఆయనను (అల్లాహ్’ను) స్మరిస్తాడో, ఆయన అతనికి ప్రశాంతతను చేకూరుస్తాడు; ఒకవేళ అతడు ఒంటరిగా ఉంటే అల్లాహ్ అతనికి నెమ్మదిని, ఉపశమనాన్ని కలుగజేస్తాడు.
“అష్’షిబ్ర్”: అంటే, దూరాన్ని కొలవడానికి అరచేతిని నేలపై విశాలంగా చాచినపుడు చిటికెన వ్రేలి కొన భాగము నుండి బొటన వ్రేలి కొన భాగం వరకు గల దూరం (జానెడు); “అల్-దిరా”: అంటే మధ్యవ్రేలి కొన భాగమునుండి మొదలుకుని మోచేతి వరకు మధ్యన గల దూరము; “అల్-బాఅ”: అంటే, నాలుగు ‘దిరా’ లకు సమానం, అంటే మనిషి ఒక చేతి మధ్య వ్రేలు చివరి నుండి, మరో చేతి మధ్యవ్రేలు చివరి వరకు మధ్య ఉన్న దూరము.