عَنْ سَهْلُ بْنُ سَعْدٍ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ يَوْمَ خَيْبَرَ:
«لَأُعْطِيَنَّ هَذِهِ الرَّايَةَ غَدًا رَجُلًا يَفْتَحُ اللَّهُ عَلَى يَدَيْهِ، يُحِبُّ اللَّهَ وَرَسُولَهُ وَيُحِبُّهُ اللَّهُ وَرَسُولُهُ»، قَالَ: فَبَاتَ النَّاسُ يَدُوكُونَ لَيْلَتَهُمْ أَيُّهُمْ يُعْطَاهَا، فَلَمَّا أَصْبَحَ النَّاسُ غَدَوْا عَلَى رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كُلُّهُمْ يَرْجُو أَنْ يُعْطَاهَا، فَقَالَ: «أَيْنَ عَلِيُّ بْنُ أَبِي طَالِبٍ؟» فَقِيلَ: هُوَ يَا رَسُولَ اللَّهِ يَشْتَكِي عَيْنَيْهِ، قَالَ: «فَأَرْسِلُوا إِلَيْهِ»، فَأُتِيَ بِهِ فَبَصَقَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي عَيْنَيْهِ وَدَعَا لَهُ، فَبَرَأَ حَتَّى كَأَنْ لَمْ يَكُنْ بِهِ وَجَعٌ، فَأَعْطَاهُ الرَّايَةَ، فَقَالَ عَلِيٌّ: يَا رَسُولَ اللَّهِ، أُقَاتِلُهُمْ حَتَّى يَكُونُوا مِثْلَنَا؟ فَقَالَ: «انْفُذْ عَلَى رِسْلِكَ حَتَّى تَنْزِلَ بِسَاحَتِهِمْ، ثُمَّ ادْعُهُمْ إِلَى الإِسْلاَمِ، وَأَخْبِرْهُمْ بِمَا يَجِبُ عَلَيْهِمْ مِنْ حَقِّ اللَّهِ فِيهِ، فَوَاللَّهِ لَأَنْ يَهْدِيَ اللَّهُ بِكَ رَجُلًا وَاحِدًا، خَيْرٌ لَكَ مِنْ أَنْ يَكُونَ لَكَ حُمْرُ النَّعَمِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4210]
المزيــد ...
సహ్ల్ బిన్ స’అద్ అస్సఅదీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఖైబర్ దినమున రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“నేను రేపు ఈ జెండాను, ఎవరి చేతుల మీదుగా అల్లాహ్ విజయాన్ని ప్రసాదిస్తాడో, అతనికి ఇస్తాను. అతడు అల్లాహ్’ను మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తాడు; అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు అతడిని ప్రేమిస్తారు.” ఆయన (సహ్ల్ బిన్ సఅద్) ఇంకా ఇలా అన్నారు: “తమలో ఎవరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ జెండాను ఇవ్వబోతున్నారో” అని ప్రజలందరూ ఆ రాత్రంతా ఉత్సుకతతో అలాగే గడిపారు. ఉదయం అవుతూనే ప్రజలందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళారు, ప్రతి ఒక్కరూ ఆ జెండాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతికే ఇస్తారు అనే ఆశతో. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ఎక్కడ?” అని అడిగారు. దానికి వారు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ! ఆయన కంటిలో ఏదో సమస్యతో బాధపడుతున్నాడు” అన్నారు. దానికి ఆయన “అయితే అతడిని తీసుకుని రావడానికి ఎవరినైనా పంపండి” అన్నారు. అప్పుడు ఆయనను తీసుకువచ్చారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కళ్ళలో ఉమ్మివేసి ఆయన కోసం ప్రార్థించారు. దానితో ఆయన అంతకు ముందు అసలు ఎప్పుడూ నొప్పి లేదు అన్నట్లుగా కోలుకున్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు జెండాను ఇచ్చారు. అలీ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఓ రసూలల్లాహ్! వారు మనలాగా (విశ్వాసులుగా) మారేంతవరకు పోరాడాలా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “మీరు వారి ప్రాంగణానికి చేరుకునే వరకు స్థిరంగా వెళ్ళండి, ఆపై వారిని ఇస్లాంలోకి ఆహ్వానించండి మరియు అల్లాహ్ యొక్క హక్కులకు సంబంధించి వారిపై ఏ ఏ విషయాలు విధి చేయబడినాయో వారికి తెలియజేయండి. ఎందుకంటే అల్లాహ్ సాక్షిగా, మీ ద్వారా ఒక వ్యక్తిని కూడా అల్లాహ్ సన్మార్గానికి (ఇస్లాం వైపునకు) నడిపిస్తే, అది మీ కొరకు ఎర్రని ఒంటెల కన్నా మేలు” అన్నారు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 4210]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలకు (భవిష్యవాణిగా ముందుగానే) తెలియజేసినారు – మరునాటి ఉదయం తాను ఏ వ్యక్తి చేతికైతే, సైన్యము తన చిహ్నంగా చేసుకునే జెండాను ఇవ్వబోతున్నాడో, అతని చేతిపై ముస్లిములు ఖైబర్ యూదులపై విజయాన్ని పొందబోతున్నారు అని. ఆ వ్యక్తి యొక్క లక్షణాలలో ఉన్న విషయం ఏమిటంటే - అతడు అల్లాహ్’ను మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తాడు; అలాగే అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు అతన్ని ప్రేమిస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటలు విని సహాబాలు – ఎవరి చేతికి ఆ జెండా ఇవ్వబడుతుంది అనే విషయం పై మాట్లాడుకుంటూ, వాదులాడుకుంటూ – ఆ గొప్ప గౌరవం తమకే దక్కాలని కోరుకుంటూ – ఆ రాత్రి గడిపారు. ఉదయం అవుతూనే వారందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు, (ప్రతి ఒక్కరూ) ఆ గొప్ప గౌరవం తనకే దక్కాలని కోరుకుంటూ.
వారిని చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ను గురించి అడిగారు.
వారు: “ఆయన అనారోగ్యంగా ఉన్నారు, కంటి సమస్యతో బాధపడుతున్నారు” అని చెప్పారు.
అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలీ రజియల్లాహు అన్హు కోసం కొందరిని పంపారు; వారు ఆయనను తీసుకువచ్చారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన పవిత్ర లాలాజలాన్ని అలీ కళ్ళలో వేసి, ఆయన కోసం దుఆ చేసినారు. దానితో అలీ రజియల్లాహు అన్హు కు అసలేమీ నొప్పి లేనట్లుగా అయి, ఆ అనారోగ్యం నయమైంది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు జెండాను ఇచ్చారు; శత్రువుల కోటను చేరుకునే వరకు స్థిరంగా కొనసాగమని ఆదేశించారు, అలాగే ఇస్లాంలోకి ప్రవేశించే అవకాశాన్ని వారికి ఇవ్వమని ఆదేశించారు. ఒకవేళ వారు ఆయనకు సానుకూలంగా సమాధానం ఇస్తే, ఇస్లాంలో వారు ఏ ఏ విధులు నిర్వర్తించాలో చెప్పమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు సూచించారు.
అప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ వైపునకు ఆహ్వానించడం యొక్క ఘనతను, గొప్పతనాన్ని అలీ రజియల్లాహు అన్హు కు వివరించారు. ఒక వ్యక్తిని ఇస్లాం వైపునకు మార్గదర్శకం చేయడానికి, మరియు అతడు ఇస్లాం స్వీకరించేందుకు, ఆ ఆహ్వానించిన వ్యక్తి కారణమైతే, అది అరబ్బుల యొక్క అత్యంత విలువైన సంపద అయిన ఎర్ర ఒంటెలను కలిగి ఉండటం మరియు వాటిని స్వంతం చేసుకోవడం లేదా దానం చేయడం కంటే కూడా అతనికి మంచిది.