+ -

عَنْ مَالِكِ بْنِ أَوْسِ بْنِ الْحَدَثَانِ أَنَّهُ قَالَ: أَقْبَلْتُ أَقُولُ مَنْ يَصْطَرِفُ الدَّرَاهِمَ؟ فَقَالَ طَلْحَةُ بْنُ عُبَيْدِ اللهِ وَهُوَ عِنْدَ عُمَرَ بْنِ الْخَطَّابِ رضي الله عنهما: أَرِنَا ذَهَبَكَ، ثُمَّ ائْتِنَا، إِذَا جَاءَ خَادِمُنَا، نُعْطِكَ وَرِقَكَ، فَقَالَ عُمَرُ بْنُ الْخَطَّابِ: كَلَّا، وَاللهِ لَتُعْطِيَنَّهُ وَرِقَهُ، أَوْ لَتَرُدَّنَّ إِلَيْهِ ذَهَبَهُ، فَإِنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«الْوَرِقُ بِالذَّهَبِ رِبًا، إِلَّا هَاءَ وَهَاءَ، وَالْبُرُّ بِالْبُرِّ رِبًا، إِلَّا هَاءَ وَهَاءَ، وَالشَّعِيرُ بِالشَّعِيرِ رِبًا، إِلَّا هَاءَ وَهَاءَ، وَالتَّمْرُ بِالتَّمْرِ رِبًا، إِلَّا هَاءَ وَهَاءَ».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1586]
المزيــد ...

మాలిక్ ఇబ్న్ ఔస్ ఇబ్న్ అల్-హదథాన్ ఉల్లేఖన:(దీనార్లకు బదులుగా) దిర్హమ్’లను మార్పిడి చేసేవారు ఎవరైనా ఉన్నారా?” అంటూ నేను అక్కడ ప్రవేశించినాను. అక్కడ తల్హా ఇబ్న్ ఉబైదుల్లాహ్, ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హుమా) ఉన్నారు. తల్హా ఇబ్న్ ఉబైదుల్లాహ్ (ర) ఇలా అన్నారు: “ముందు నీవు తెచ్చిన బంగారాన్ని చూపించు, కొద్దిసేపటి తరువాత తిరిగిరా, అప్పుడు నా సేవకుడు నీకు వెండి నాణాలను ఇస్తాడు”. అది విని ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “అల్లాహ్ సాక్షిగా (చెబుతున్నాను) ఇది సరికాదు. నువ్వు ఇప్పుడే అతనికి వెండి నాణాలను ఇవ్వు, లేదా అతని బంగారం అతనికి తిరిగి ఇచ్చివేయి, ఎందుకంటే, నిశ్చయంగా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
“బంగారానికి బదులుగా వెండి అక్కడికక్కడే (ఉన్న చోటునే) మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది; అలాగే గోధుమలకు బదులుగా గోధుమలు అక్కడికక్కడే మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది; బార్లీ గింజలకు బదులుగా బార్లీ గింజలు అక్కడికక్కడే మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది; ఖర్జూరాలకు బదులుగా ఖర్జూరాలను అక్కడికక్కడే మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది.”

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 1586]

వివరణ

‘తాబయీ’ అయిన మాలిక్ ఇబ్న్ ఔస్ ఇలా తెలియ జేస్తున్నారు: తన వద్ద బంగారు దీనార్లు ఉన్నాయని, తాను వాటిని వెండి దిర్హంలతో మార్పిడి చేయాలనుకున్నానని, అపుడు తల్హా ఇబ్న్ ఉబైదుల్లాహ్ (ర) తనతో ఇలా అన్నారు: “ముందుగా నీ దీనార్లను నాకు ఇవ్వు, నన్ను పరిశీలించనివ్వు”. ఆయన వాటిని పరిశీలించిన తరువాత వాటిని కొనడానికి నిశ్చయించుకుని అతనితో ఇలా అన్నారు: “ప్రస్తుతం నా సేవకుడు లేడు, అతడు వచ్చిన తరువాత నీకు దిర్హంలను ఇస్తాను. నీవు వెళ్ళి తరువాత రా”. అది విని అక్కడే ఉన్న ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఈ లావాదేవీ బేరాన్ని ‘ఇది సరికాదు’ అంటూ ఆక్షేపించినారు. అల్లాహ్ సాక్షిగా ఒట్టు పెట్టుకుని తల్హా ఇబ్న్ ఉబైదుల్లాహ్ (ర) తో అప్పటికప్పుడే అతనికి వెండి దిర్హంలను చెల్లించమని, లేదా అతని బంగారు దీనార్లు అతనికి తిరిగి ఇచ్చివేయమని చెప్పి, అందుకు కారణాన్ని ఇలా వివరించినారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బంగారానికి బదులుగా వెండి, లేదా వెండికి బదులుగా బంగారం మార్పిడి చేసుకునే లావాదేవీ వ్యవహారంలో వాటిని అక్కడికక్కడే (ఉన్న చోటునే) మార్పిడి చేసుకోవాలి, లేకపోతే అది వడ్డీ ఆధారిత లావాదేవీ వ్యవహారం అవుతుంది, అది హరాం. మరియు ఆ లావాదేవీ వ్యవహారం చెల్లుబాటు కానిది అవుతుంది. వెండికి బదులుగా బంగారం అమ్మబడదు, అలాగే బంగారానికి బదులుగా వెండి అమ్మబడదు – అవి ఉన్నచోటునే (అక్కడికక్కడే) మార్పిడి చేసుకోబడితే తప్ప. అంతేకాకుండా, గోధుమలకు బదులుగా గోధుమలను, బార్లీకి బదులుగా బార్లీని, మరియు ఖర్జూరాలకు బదులుగా ఖర్జూరాలను విక్రయించరాదు; అయితే అవి తూగిన బరువుకు సమానంగా ఇవ్వబడితే తప్ప, లేక కొలిచిన కొలతకు సమానంగా కొలిచి ఇస్తే తప్ప మరియు అవి వెంటనే, అక్కడికక్కడే ఇచ్చివేయబడాలి (చేతులు మారాలి); అలాకాకుండా కొద్దికాలం వాయిదా తరువాత చెల్లించేలా విక్రయించుట చేయరాదు.

من فوائد الحديث

  1. ఈ హదీథులో ఐదు రకాల వస్తువులు పేర్కొనబడినాయి: అవి, బంగారం, వెండి, గోధుమలు, బార్లీ మరియు ఖర్జూరాలు. విక్రయం ఒకే రకమైన వస్తువులను కలిగి ఉన్నట్లయితే, ఆ విక్రయ వ్యవహారం చెల్లుబాటు కావడానికి రెండు షరతులు పూర్తి చేయవలసి ఉంటుంది. మొదటిది ఆ విక్రయం - బేరం కుదిరిన వెంటనే, అక్కడికక్కడే, అప్పటికప్పుడే జరగాలి, మరియు రెండవది - విక్రయించబడిన వస్తువుల బరువులు సమానంగా ఉండాలి. ఉదాహరణకు బంగారానికి బదులుగా బంగారం. అవి సమానంగా లేకపోతే అది ‘రిబా అల్ ఫద్ల్’ (మిగులు వడ్డీ) వ్యవహారం అవుతుంది. మరోవైపు, అమ్మక వ్యవహారం వివిధరకాల వస్తువుల మధ్య ఉన్నట్లయితే; అంటే ఉదాహరణకు గోధుమలకు బదులుగా వెండిని (నాణాల రూపంలోగానీ లేక మరో రూపంలో గానీ) ఇవ్వడం; ఇటువంటి అమ్మకం వ్యవహారం చెల్లిబాటు కావడానికి ఒక షరతు తప్పనిసరిగా పూర్తి చేయవలసి ఉంటుంది – అది బేరం కుదుర్చుకున్న ధరను అప్పటికప్పుడే, అక్కడికక్కడే చెల్లించాలి; లేకుంటే అది ‘రిబా అన్’నసీఅహ్’ (వాయిదా చెల్లింపు వడ్డీ) అవుతుంది.
  2. “మజ్లిస్ అల్ అఖద్” (ఒప్పంద సమావేశం): అంటే అమ్మకం జరిగే ప్రదేశాన్ని సూచిస్తుంది. రెండు పక్షాలు కూర్చుని ఒప్పందం చేసుకున్నా, లేక నడుస్తూ ఒప్పందం చేసుకున్నా లేక గుర్రాలపై స్వారీ చేస్తూ ఒప్పందం చేసుకున్నా అది ‘మజ్లిస్ అల్ అఖద్’ అనబడుతుంది. మరియు ‘విడిపోవుట’ అంటే, సాధారణంగా ‘ఒప్పంద సమావేశం ముగిసింది’ అని ప్రజలలో బాగా వాడుకలో ఉన్న విధానాన్ని సూచిస్తుంది.
  3. హదీథులో ఉన్న నిషేధము బంగారము ఏ రూపంలో ఉన్నా వర్తిస్తుంది, అంటే బంగారము నాణెముల రూపములో ఉన్నా, లేక నాణెముల రూపములో లేకపోయినా వర్తిస్తుంది; అలాగే వెండి ఏ రూపంలో ఉన్నా వర్తిస్తుంది, అంటే వెండి నాణెముల రూపములో ఉన్నా, లేక నాణెముల రూపములో లేకపోయినా వర్తిస్తుంది.
  4. బంగారము మరియు వెండి విక్రయంలో ఏఏ విషయాలు, సూత్రాలు వర్తిస్తాయో, అవే ఈ రోజుల్లో చలామణిలో ఉన్న ద్రవ్యానికి (ఈరోజుల్లో ఉపయోగములో ఉన్న నాణెములు, కరెన్సీ, ధనము, డబ్బు మొ.) కూడా వర్తిస్తాయి. అంటే, ఒక దేశపు కరెన్సీని మరోదేశపు కరెన్సీతో మారకం చేయవలసి వచ్చినపుడు, ఉదాహరణకు: రియాల్’లకు బదులుగా దిర్హంలను తీసుకోవలసి వచ్చినపుడు, లేక డాలర్లకు బదులుగా రూపాయలు తీసుకోవలసి వచ్చినపుడు, వాటి విలువలో ఉన్న వ్యత్యాసం విషయంలో రెండు పక్షాలు ఒక అంగీరానికి వచ్చి మారకం చేసుకోవచ్చు. అయితే ఆ మారకం అనేది అదే సమావేశంలో అక్కడికక్కడే జరగాలి. అలా కాకుంటే ఆ లావాదేవీ చెల్లుబడి కాదు. అది వడ్డీ ఆధారిత లావాదేవీ అవుతుంది, మరియు అది హరాం.
  5. వడ్డీ ఆధారిత లావాదేవీలకు, బేరసారాలు అనుమతి లేదు. అటువంటి ఒప్పందాలు, ఒడంబడికలు చెల్లవు – ఇరుపక్షాలు ఆ విధమైన ఒప్పందాలు, ఒడంబడికలు తమ ఇష్టపూర్వకంగా చేసుకున్నప్పటికీ. ఎందుకంటే ఇస్లాం వ్యక్తుల హక్కులను, మరియు సమాజం యొక్క హక్కులను పరిరక్షిస్తుంది – అతడు తన హక్కులను వదిలివేసుకున్నప్పటికీ.
  6. ఎవరైతే చెడును, కీడును, హానిని నిషేధించగల స్థాయి, సమర్థత, లేక వాటిని నిరోధించగల స్థాయి, స్థోమత కలిగి ఉంటారో, వారు అలా తప్పనిసరిగా చేయాలి.
  7. ఏదైనా విషయాన్ని ఖండిస్తున్నట్లయితే, దానికి తగిన ఋజువును కూడా చూపాలి, లేదా ప్రస్తావించాలి, ఏవిధంగానైతే ఈ హదీథులో ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ చేసినారో.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ జర్మన్ పష్టో అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية النيبالية الرومانية المجرية الموري Урумӣ الجورجية
అనువాదాలను వీక్షించండి
ఇంకా