+ -

عَنْ رَافِعِ بْنِ خَدِيجٍ رَضيَ اللهُ عنهُ قَالَ:
كُنَّا مَعَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بِذِي الحُلَيْفَةِ، فَأَصَابَ النَّاسَ جُوعٌ، فَأَصَابُوا إِبِلًا وَغَنَمًا، قَالَ: وَكَانَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي أُخْرَيَاتِ القَوْمِ، فَعَجِلُوا، وَذَبَحُوا، وَنَصَبُوا القُدُورَ، فَأَمَرَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بِالقُدُورِ، فَأُكْفِئَتْ، ثُمَّ قَسَمَ، فَعَدَلَ عَشَرَةً مِنَ الغَنَمِ بِبَعِيرٍ فَنَدَّ مِنْهَا بَعِيرٌ، فَطَلَبُوهُ، فَأَعْيَاهُمْ وَكَانَ فِي القَوْمِ خَيْلٌ يَسِيرَةٌ، فَأَهْوَى رَجُلٌ مِنْهُمْ بِسَهْمٍ، فَحَبَسَهُ اللَّهُ، ثُمَّ قَالَ: «إِنَّ لِهَذِهِ البَهَائِمِ أَوَابِدَ كَأَوَابِدِ الوَحْشِ، فَمَا غَلَبَكُمْ مِنْهَا فَاصْنَعُوا بِهِ هَكَذَا»، فَقَالَ أي رافع: إِنَّا نَرْجُو -أَوْ نَخَافُ- العَدُوَّ غَدًا، وَلَيْسَتْ مَعَنَا مُدًى، أَفَنَذْبَحُ بِالقَصَبِ؟ قَالَ: «مَا أَنْهَرَ الدَّمَ، وَذُكِرَ اسْمُ اللَّهِ عَلَيْهِ فَكُلُوهُ، لَيْسَ السِّنَّ وَالظُّفُرَ، وَسَأُحَدِّثُكُمْ عَنْ ذَلِكَ: أَمَّا السِّنُّ فَعَظْمٌ، وَأَمَّا الظُّفُرُ فَمُدَى الحَبَشَةِ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2488]
المزيــد ...

రాఫిఅ్ బిన్ ఖదీజ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన:
ఒకసారి ధుల్ హులైఫహ్ వద్ద మేమందరమూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో ఉన్నాము. కరువు స్థితి కారణంగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అయితే (అప్పటికే యుధ్ధసంపదలో భాగంగా) ఒంటెలను, గొర్రెలను స్వాధీనం చేసుకుని ఉన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారందరి వెనుక (దూరంగా) ఉన్నారు. వారు తొందరతొందరగా పశువుల నుండి కొన్నిటిని జిబహ్ చేసి (వధించి), వంట పాత్రలలో వాటి మాంసాన్ని ఉంచి వండడం మొదలుపెట్టారు. (వారందరి వెనుక ఉన్న) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చి ఆ పాత్రలను బోర్లా చేసి వాటిలో (ఉడుకుతూ) ఉన్న మాంసాన్ని పారవేయమని ఆదేశించినారు. తరువాత యుధ్ధసంపదగా తమ ఆధీనం లో ఉన్న పశువులను అందరికీ పంచివేసినారు; పది గొర్రెలను ఒక ఒంటెకు సమానంగా పంచినారు. వాటిలో ఒక ఒంటె పారిపోయింది. జనులు దానిని పట్టుకోవడానికి, అలిసిపోయేదాకా దాని వెంట పరుగెత్తినారు. ఆ సమయం లో వారి దగ్గర కొన్ని గుర్రాలు ఉన్నాయి. వారిలో ఒకరు బాణాన్ని ఎక్కుపెట్టి ఆ ఒంటెపైకి వదిలినాడు. ఆ బాణంతో అల్లాహ్ ఆ ఒంటెను ఆగిపోయేలా చేసినాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “నిశ్చయంగా,ఈ జంతువులలో కొన్ని సహజంగానే అడవి జంతువుల మాదిరి స్వభావాన్ని కలిగి ఉంటాయి, కనుక వాటిలో ఒకదానిపై మీరు నియంత్రణ కోల్పోతే, ఈ విధంగా చేయండి (దానిని నియంత్రణలోనికి తెచ్చుకొండి)" అతడు, అంటే రాఫిఅ్ బిన్ ఖదీజ్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “రేపు మనం శత్రువును ఎదుర్కొనవచ్చు అని సందేహంగానూ, భయంగానూ ఉన్నది, (యుధ్ధం కారణంగా) మా దగ్గర కత్తులు ఉండకపోవచ్చు. అపుడు మరి మేము ‘అల్ ఖసబ్’ తో (ఒక రకమైన రెల్లు బెత్తము, వెదురు బొంగు లాంటిది, దాని ఒక చివర పదునుగా చెక్కి పనిముట్టుగా, ఆయుధంగా ఉపయోగిస్తారు) జంతువును ‘జిబహ్’ చేయవచ్చునా?” దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “జంతువు శరీరం నుండి రక్తం పూర్తిగా ప్రవహించేలా చేసే ఏ ఉపకరణాన్నైనా ఉపయోగించండి, వాటిని జిబహ్ చేయునపుడు (వధించునపుడు) అల్లాహ్ నామం ఉచ్ఛరించబడితే వాటిని తినండి. అయితే దంతాలతో లేదా గోళ్లతో ‘జిబహ్’ చేయవద్దు (వధించవద్దు); ఎందుకో నేను మీకు చెప్తాను: ఎందుకంటే దంతాలు ఎముకలు కనుక; మరియు గోళ్లు ఇథియోపియన్లు ఉపయోగించే సాధనాలు కనుక.”

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 2488]

వివరణ

రాఫిఅ్ బిన్ ఖదీజ్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేస్తున్నారు: దుల్-హులైఫాలో వారందరూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో ఉన్నారు. అపుడువారు కరువుబారిన పడ్డారు. వారు (అప్పటికే గెలిచిన యొధ్ధములో) బహుదైవారాధకుల నుండి ఒంటెలను మరియు గొర్రెలను యుధ్ధసంపద రూపములో స్వాధీనం చేసుకున్నారు. ఆ యుధ్ధ సంపదను విభజించడానికి ముందే తొందరపడి, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అడగకుండానే, వాటిలో కొన్నింటిని వధించి, వంట పాత్రలను ఏర్పాటు చేసారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహబాల సమూహానికి వెనుక నడుస్తూ వస్తున్నారు. ఎపుడైతె వారికి ఈ విషయం తెలిసిందో, వారు ఆ వంట పాత్రలను బోర్లించేసి అందులోని మాంసాన్ని పారవేయమని ఆదేశించినారు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆ యుధ్ధసంపదను, పది గొర్రెలను ఒక ఒంటెకు సమానంగా, అందరిలో విభజించినారు. వాటిలో ఒక ఒంటె పారిపోయింది. వారు దానిని పట్టుకోలేకపోయారు. వారి వద్ద కొన్ని గుర్రాలే ఉన్నాయి. వారిలో ఒకరు ఒక బాణాన్ని ఎక్కుపెట్టి ఒంటెపైకి వదిలాడు. ఆబాణముతో అల్లాహ్ దానిని ఆగిపోయేలా చేసినాడు. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: ఈ పెంపుడు జంతువులు అడవి మృగాల వంటి లక్షణాలనే కలిగిఉంటాయి. కనుక వీటిలో ఏదైనా మీ అదుపు తప్పితే, మీరు దానినిపట్టుకో లేకపోతే, వాటిని ఇలాగే అదుపులోనికి తెచ్చుకొండి. రాఫిఅ్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “రేపు మేము శత్రువును ఎదుర్కొనవచ్చు. యుధ్ధములో ఉపయోగించిన కారణంగా మా ఖడ్గాలు పదును కోల్పోతయేమోనని భయంగా కూడా ఉంది. మావద్ద కత్తులు కూడా లేవు. మరి అత్యవసరంగా జంతువులను (ఆహారం కొరకు) ‘జిబహ్’ చేయవలసి వస్తే (వధించవలసి వస్తే) మేము పదునైన కర్రతో జిబహ్ చేయవచ్చునా?” దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “(జంతువు శరీరం నుండి) పూర్తిగా రక్తం బయటకు పారేలా చేయగలిగే ఏ పరికరాన్నైనా ఉపయోగించండి; దంతములు మరియు గోళ్ళు తప్ప. అలాగే అల్లాహ్ నామం ఉచ్చరించబడి జిబహ్ చేయబడిన దానిని తినండి. అయితే దంతములు మరియు గోళ్ళు ఎందుకు ఉపయోగించరాదో నేను మీకు చెబుతాను; దంతములు ఎముకలు కనుక మరియు గోళ్ళు అబిస్సీనియా (ఇథియోపియా) బహుదైవారాధకుల సాధనాలు గనుక.”

من فوائد الحديث

  1. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సైన్యం వెనుక భాగంలో నడవడం, తన సహచరుల పట్ల ఆయనకున్న శ్రద్ధను, వారి శ్రేయస్సును పరిశీలించడాన్ని మరియు వారి సలహాలను అంగీకరించడాన్ని తద్వారా ప్రవక్త యొక్క వినయాన్ని ప్రతిబింబిస్తుంది.
  2. ఇందులో నాయకుడు తన ప్రజలను మరియు సైనికులను క్రమశిక్షణలో పెట్టడం చూస్తాము; ఎందుకంటే వారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి అనుమతి కోరకుండానే తొందరపాటు చర్యకు పాల్బడినారు. అందుకని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని క్రమశిక్షణలో పెట్టినారు. వారు చేసిన దానికి పర్యవసానంగా వారు కోరుకున్నది వారికి దక్కలేదు.
  3. అలాగే ఇందులో, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఆదేశాలకు సహబాలు మరో ఆలోచన లేకుండా వెంటనే శిరసావహించడం చూస్తాము.
  4. యుధ్ధసంపదను విభజించడానికి ముందే దానిని ఏ విధంగానూ ఉపయోగించడం నిషేధం (హరాం).
  5. న్యాయముగా మరియు ధర్మబధ్ధంగా వ్యవహరించడం ముఖ్యం – ప్రత్యేకించి శత్రువులు మరియు అవిశ్వాసులకు వ్యతిరేకంగా జిహాద్ చేయు అందర్భములో. ఎందుకంటే ఇది శత్రువులపై విజయానికి మరియు గొప్ప సాఫల్య సాధనాలలో ఒకటి.
  6. ఇమాం నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఒంటె, ఆవు, గుర్రము లేక గొర్రె వంటి సాధారణ పెంపుడు జంతువు ఏదైనా అడవి జంతువు మాదిరిగా క్రూరంగా, విశ్రుంఖలంగా ప్రవర్తించడం మొదలు పెడితే, లేదా అదుపు తప్పి పారిపోతే అప్పుడు అది వేట జంతువు మాదిరిగా పరిగణించబడుతుంది. దానిని బాణము మొదలైన ఆయుధాలతో వేటాడం షరియత్ ప్రకారం సరియైనది అవుతుంది.
  7. ‘జిబహ్’ చేయబడిన జంతువు తినడానికి అనుమతించబడాలి అంటే ఆ జంతువుకు సంబంధించి ఈ షరతులు వర్తిస్తాయి: 1) అది షరియత్ ప్రకారం తినడానికి అనుమతించబడిన జంతువు అయి ఉండాలి; 2) ఆ జంతువు మీ శక్తి, సామర్థ్యాల మేరకు మీరు పట్టుకోగలిగినదై, అదుపులోనికి తీసుకోగలిగినది అయి ఉండాలి; అదుపులోనికి తీసుకోలేని జంతువు వేట జంతువుగా పరిగణించబడుతుంది; 3) అది భూమిపై సంచరించే జంతువు అయి ఉండాలి; సముద్రపు జంతువులను ‘జిబహ్’ చేయనవసరం లేదు.
  8. ‘జిబహ్’ యొక్క చెల్లుబాటుకు (ధర్మ సమ్మతంగానే జరిగింది అనడానికి) నియమాలు: 1) ‘జిబహ్’ చేసే వ్యక్తి మతిస్థిమితము కలిగిన, వివేకవంతుడైన ముస్లిం లేదా క్రైస్తవుడై ఉండాలి; 2) ‘జిబహ్’ చేయుటకు ముందు అతడు అల్లాహ్ నామమును విధిగా ఉచ్ఛరించాలి; 3) ‘జిబహ్’ చేయుట కొరకు ఉపయోగించే పరికరము ‘జిబహ్’ చేయుటకు అనువైనదై ఉండాలి, అంటే ఆ పరికరం పదునైనదై, దంతములు మరియు గోళ్ళు తప్ప, మరింకే పదార్థముతో నైనను తయారుచేయబడినదై ఉండవచ్చును; 4) ఎవరైతే జిబహ్ చేస్తారో, జిబహ్ చేయు స్థలము, జిబహ్ స్థానము (జంతువు యొక్క గొంతు) అతనికి దగ్గరలో అందుబాటులో ఉండాలి; జంతువు యొక్క శ్వాసనాళిక, గొంతు (అన్నవాహిక) మరియు మెడప్రక్కనుండు ‘కంఠసిర’ లను కత్తిరించడం ద్వారా జిబహ్ ప్రక్రియ జరగాలి.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية الدرية الرومانية المجرية الجورجية المقدونية الخميرية الماراثية
అనువాదాలను వీక్షించండి