____
[] - []
المزيــد ...
అబూ అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ ఇబ్నుల్-ఖత్తాబ్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను:
“ఇస్లాం (మూలస్తంభముల వంటి) ఐదు విషయాలపై నిర్మితమై ఉన్నది. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు (అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు) అని సాక్ష్యం పలుకుట; సలాహ్’ను (నమాజును) స్థాపించుట; జకాతు (సంపదల నుండి విధిగా చెల్లించవలసిన దానము) చెల్లించుట, కాబా గృహము యొక్క హజ్ చేయుట; మరియు రమదాన్ మాసము ఉపవాసములు పాటించుట,”
[దృఢమైనది] - [رواه البخاري ومسلم] - [الأربعون النووية - 3]
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాంను ఒక పటిష్టమైన నిర్మాణంతో పోల్చారు, దాని ఐదు స్తంభాలు ఆ నిర్మాణానికి బలాన్ని, ఆధారాన్ని చేకూరుస్తాయి. ఇస్లాం యొక్క మిగతా విషయాలు ఆ నిర్మాణాన్ని పరిపూర్ణం చేస్తాయి. ఈ మూలస్తంభాలలో మొదటిది: “షహాదతైన్” (రెండు సాక్ష్యాపు వాక్యాలు ఉచ్చరించుట). “అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజఆరాధ్యుడు ఎవరూ లేరు” అని సాక్ష్యము పలుకుట, మరియు “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన యొక్క సందేశహరుడు” అని సాక్ష్యం పలుకుట. ఈ రెండూ కలిసి ఒకే మూలస్తంభము; ఇవి ఒకదాని నుండి మరొకటి విడదీయరానివి. దాసుడు ఈ సాక్ష్యపు వాక్యాలు ఉచ్చరిస్తాడు, తద్వారా అతడు అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని, మరియు కేవలం ఆయన మాత్రమే ఆరాధనలకు నిజమైన అర్హుడని, ఆయన తప్ప మరింకెవ్వరూ అర్హులు కారని గుర్తిస్తున్నాడు మరియు అంగీకరిస్తున్నాడు అన్నమాట. అదేవిధంగా అతడు, తాను ఉచ్చరించిన సాక్ష్యాపు వాక్యాలకు అనుగుణంగా ఆచరిస్తాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశాన్ని విశ్వసిస్తాడు మరియు ఆయనను అనుసరిస్తాడు. మూలస్తంభాలలో రెండవది: సలాహ్’ను స్థాపించుట. అంటే దినము మరియు రాత్రిలో విధిగా ఆచరించవలసిన ఐదు పూటల నమాజులను, వాటి నిర్ధారిత వేళల్లో, వాటికి సంబంధించిన నియమాలు, విధులు మరియు విధానాలను అనుసరిస్తూ ఆచరించుట; ఈ ఐదు: ఫజ్ర్, జుహ్ర్, అస్ర్, మగ్రిబ్ మరియు ఇషా నమాజులు. మూడవ మూలస్థంభము: జకాతును విధిగా చెల్లించుట. ఇది ఒక ఆర్థికపరమైన ఆరాధన. షరియత్ లో నిర్ధారించబడిన ఒక స్థాయికి చేరిన సంపదపై జకాతు చెల్లించుట విధి. మరియు అట్టి జకాతు దానికి తగిన అర్హులకు ఇవ్వబడుతుంది. నాలుగ మూలస్థంభము: “హజ్జ్”. అల్లాహ్ యొక్క ఆరాధనలో భాగంగా మక్కా నగరంలోని కాబా గృహాన్ని దర్శించి అక్కడ దానికి సంబంధించిన విధి,విధానాలను ఆచరించడాన్ని “హజ్జ్” అంటారు. ఐదవ మూల స్థంభము: రమదాన్ నెల ఉపవాసములు పాటించుట: ఉపవాసము అంటే – అల్లాహ్’ను ఆరాధించే సంకల్పముతో, ఉషోదయం నుండి మొదలుకుని సూర్యాస్తమయం వరకు తినుట, త్రాగుట మరియు ఉపవాసాన్ని భంగపరిచే ప్రతి విషయాన్నుండి దూరంగా ఉండుట.